ఆచార్య సినిమా కథ తనదంటూ రాజేష్ అనే ఓ రచయిత హడావిడి చేస్తున్నారు. అయితే దీన్ని సినిమా నిర్మాణ భాగస్వామి మైత్రి మూవీ మేకర్స్, దర్శకుడు కొరటాల శివ ఖండించారు. కానీ.. ఈ వివాదం టాలీవుడ్ లో పెను దుమారాన్ని రేపింది. చిరంజీవి సినిమా, అందులోనూ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఆచార్యపై వివాదం అనే సరికి అందరి దృష్టీ దీనిపైనే పడింది. చిరంజీవి సినిమా కథ కాపీనా, కాపీ కథతో మెగాస్టార్ సినిమా తీస్తున్నారంటూ కొన్ని వార్తలు కూడా వచ్చాయి. దీంతో చిరంజీవి బాగా హర్ట్ అయ్యారని తెలుస్తోంది. అసలీ వివాదం ఏంటి? దీన్ని త్వరగా పరిష్కరించుకోవాలని దర్శకుడు కొరటాల శివతో తెగేసి చెప్పారట చిరంజీవి.