కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అధ్యక్షతన నేడు జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలు, రాష్ట్ర ప్రభుత్వాల సంసిద్ధతపై సమీక్షించారు. తుఫాను ముందు నష్ట నివారణ చర్యలు, తుఫాను తరువాత ప్రభుత్వాలు కల్పించే సదుపాయాలు, ప్రజలను కాపాడటానికి చేపట్టిన సన్నాహక చర్యలను జాతీయ విపత్తు నిర్వహణ కమిటీకి ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రల ప్రధాన కార్యదర్శులు స్పష్టంగా వివరించారు. ఏపీ, ఒడిశాలో తుపాను పరిస్థితులు ఎదుర్కొనేందుకు 18 ఎన్డిఆర్ఎఫ్ బృందాలను మోహరించినట్టు సమావేశంలో వెల్లడించారు. సహాయక చర్యల కోసం ఆర్మీ, నేవీ రెస్క్యూ, రిలీఫ్ బృందాలను రంగంలోకి దింపుతున్నట్టు స్పష్టం చేశారు. తుఫాను రాకమునుపే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని క్యాబినెట్ సెక్రటరీ అధికారులకు ఆదేశించారు.