ఏలూరు కలెక్టరేట్ వద్ద కొల్లేరు ప్రజలు ఆందోళనకు దిగారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమాలో కొల్లేరు సరస్సును కాలుష్య కారకంగా, వ్యర్థాలతో చేపలను పెంచుతున్నట్లు చూపించడంపై ఆగ్రహం వ్యక్తూ నిరసనకు దిగారు. అంతే కాకుండా రిపబ్లిక్ సినిమా నిర్మాత, దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. కొల్లేరులో రాజకీయ పార్టీలకు సంబంధం లేదని... కొల్లేరు గురించి తప్పుగా చిత్రీకరిస్తే మేమంతా ఒక్కటే అంటూ కలెక్డరేట్ ముందు రిపబ్లిక్ సినిమాపై మండి పడ్డారు. రిపబ్లిక్ సినిమాలో కొల్లేరుపై చూపించిన సన్నివేశాల్ని వెంటనే తొలగించకపోతే సుప్రీం కోర్టుకు వెళ్తాం అంటూ నిరసన కారులు వార్నింగ్ ఇచ్చారు. ఈ నిరసనలో కొల్లేరు పరిరక్షణ సమితి నాయకులు పళ్లెం ప్రసాద్, మండల కొండలరావు మరియు ఏపీ వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ సైదు గాయత్రి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా రిపబ్లిక్ సినిమాను విడుదల చేయగా మిశ్రమ స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే.