ఏపీ ఇంధన శాఖ కొత్త రికార్డు సాధించింది. వరుసగా రెండో ఏడాది కూడా ప్రతిష్టాత్మక నేషనల్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ అవార్డు గెలుచుకుంది. ఈ అవార్డు గెలుచుకున్న ఇంధన శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అభినందించారు. ప్రతిష్టాత్మక నేషనల్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ అవార్డు- 2023ను ఆంధ్రరాష్ట్రం ద‌క్కించుకున్న సందర్భంగా సీఎం సంతోషం వ్యక్తం చేశారు. వ‌రుస‌గా రెండేళ్లలో రెండుసార్లు అత్యుత్తమ ఇంధన సామర్థ్య అవార్డును ద‌క్కించుకొని రికార్డు సృష్టించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవ‌ల న్యూ ఢిల్లీలో జ‌రిగిన కార్యక్రమంలో రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా ఇంధ‌న శాఖ అధికారులు ఈ అవార్డు తీసుకున్నారు.


ఆ తర్వాత తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ను ఇంధ‌న శాఖ అధికారులు కలిశారు. తమకు వచ్చిన అవార్డును సీఎంకు అంద‌జేసి, వివరాలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా అధికారుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మెచ్చుకున్నారు. ముఖ్యమంత్రిని క‌లిసిన అధికారుల్లో ఇంధన శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కె. విజయానంద్, ఏపీ జెన్‌కో ఎండీ కె.వి.ఎన్‌ చక్రధర్‌ బాబు,ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ (విజిలెన్స్, సెక్యూరిటీ) బి.మల్లారెడ్డి, ఏపీఎస్‌ఈసీఎం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ బీఏవీపీ కుమారరెడ్డి తదితరులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: