ఐపీఎల్ సీజన్ షురూ అయ్యిందంటే చాలు బెట్టింగ్ రాయుళ్లు బెట్టింగ్ లు వేసేందుకు రెడీగా ఉంటారు. బెట్టింగ్ ల వల్ల జీవితాలు నాశనం అవుతాయని చెప్పినా కూడా పట్టించుకోకుండా కుంటుంబాన్ని రోడ్డుకు ఈడుస్తుంటారు. ఇక తాజాగా ఐపీఎల్ ప్రారంభం అవ్వడంతో క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న గ్యాంగ్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంధర్బంగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ...దుబాయ్ లో జరుగుతున్న ముంబై వర్సెస్ పంజాబ్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో బెట్టింగ్ లు వేశారని చెప్పారు. తమకు పక్కా సమాచారం అందడంతో 7 చోట్ల దాడులు చేసామని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. మియాపూర్, బాచుపల్లి, గచ్చిబౌలి, మైలర్ దేవ్ పల్లి తో పాటు పలు ప్రాంతాల్లో దాడులు చేశామని చెప్పారు.