మహిళా క్రికెట్ చరిత్ర లో తొలి తరం వికెట్ కీపర్‌గా గుర్తింపు పొందిన ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ లోర్నా బీల్ క‌న్నుమూశారు. విక్టోరియన్ మహిళా జట్టు తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన 96ఏళ్ల బీల్ సోమవారం మృతి చెందినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో తెలిపింది. 1923లో మెల్‌బోర్న్ లో పుట్టిన బీల్ తన తొలి టెస్టు న్యూజీలాండ్ జట్టు తో 1948లో ఆడారు. ఆస్ట్రేలియా తరఫున ఆమె ఏడు టెస్టు మ్యాచ్‌లు ఆడారు. వికెట్ కీపింగ్ తోపాటు కుడిచేతి వాటం బ్యాట్స్‌వుమెన్ గానూ బీల్ రాణించారు. 1951లో ఇంగ్లాండ్ పర్యటన అనంతరం ఆమె ఆటకు గుడ్‌బై చెప్పారు. 12 ఏళ్ల వయసు నుంచే ఆమె క్రికెట్ ను ఆడటం మొదలు పెట్టారు. తొలుత హౌథ్రోన్ లేడీస్ క్రికెట్ క్లబ్ కు ఆ తర్వాత విక్టోరియా జట్టుకు కూడా ఆడారు.


ఆమె ప్రతిభ ఆధారంగా ఆస్ట్రేలియా జాతీయ జట్టు కు ఎంపిక చేశారు. క్రికెట్ నుంచి వీడ్కోలు  తీసుకున్న తర్వాత గోల్ఫ్ క్రీడ వైపు మళ్లారు. ఏడేళ్ల పాటు నేషనల్ గోల్ఫ్ యూనియన్ కౌన్సిల్ సభ్యురాలుగా , బాక్స్‌హిల్ క్లబ్ కెప్టెన్ గా కూడా సేవలందించారు. లోర్నా బీల్ మరణం ఆస్ట్రేలియాలోని బడ్డింగ్ క్రికెటర్లకు తీరని లోటని, ఆమె చూపిన బాటలో ఎందరో మహిళా క్రికెటర్లు రాటుదేలారని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో నిక్ హాక్లే నివాళులర్పించారు.అలాగే భార‌త మ‌హిళా క్రికెట్ స‌భ్యులు కూడా బీల్ మృతికి నివాళి అర్పించారు.ఎంతోమంది మ‌హిళా క్రికెట‌ర్ల‌కు ఆమె స్ఫూర్తిగా నిలిచార‌ని ఆస్ట్రేలియా మ‌హిళా క్రికెట‌ర్లు కొనియాడుతున్నారు.


ఆస్ట్రేలియా మ‌హిళా క్రికెట్ జ‌ట్టుకు నేడున్నంత ఆద‌ర‌ణ ఆ రోజుల్లో లేదు. ఆ మాట‌కు వ‌స్తే అస‌లు క్రికెట్‌కు ఇంత క్రేజ్ కూడా లేదు. అయినా ఆ రోజుల్లో ఆమె ఎంతో ఇష్టంతో క్రికెట్ ఆడారు. నేటిత‌రానికి ఉన్న‌న్ని మ్యాచ్ ల నిర్వ‌హ‌ణ అప్ప‌ట్లో సాధ్యం కాలేదు. లేదంటే ఆమె ప్ర‌తిభ మ‌రింత వెలుగులోకి వ‌చ్చేద‌ని పేర్కొంటున్నారు. ఆమె అద్భుతంగా బ్యాటింగ్ చేయ‌డంతో పాటు కీప‌ర్‌గాను రాణించార‌ని మ‌హిళా క్రికెట‌ర్లు కొనియాడుతున్నారు. క్రికెట్ మ‌నుగ‌డ‌లో ఉన్నంత కాలం బీల్ పేరు చిర‌స్థాయిగా మిగిలిపోతుంద‌ని పేర్కొన్నారు. ఆమె స్ఫూర్తి మా గుండెల్లో ఎప్పుడూ ఉంటుంద‌ని చెప్పారు.

Find out more: