మాజీ మంత్రి ఈటల రాజేందర్ భవిష్యత్ రాజకీయ ప్రణాళికపై ప్రస్తుతానికి వినిపిస్తున్నవన్నీ ఊహాగానాలుగానే తేలిపోయింది. ఆయన కొత్త పార్టీ పెడతారా, లేక ఇంకేదైనా పార్టీలో చేరతారా అనేది సస్పెన్స్ గా మారింది. గత కొన్నిరోజులుగా హుజూరాబాద్ లోనే మకాం పెట్టిన ఈటల, కొత్త పార్టీకోసం ప్రణాలికలు రచిస్తున్నారని అన్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి సహా ఇతర నేతలు ఆయనను కలసి తమ సంఘీభావం ప్రకటించారు. కొత్త పార్టీ పెట్టినా, ఇతర పార్టీల్లోకి వెళ్లినా.. ఆయనకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ దశలో ఈటల కొత్త పార్టీ పెట్టడానికే మొగ్గు చూపుతారనే ప్రచారం జరిగింది. తాజాగా ఆయన జాతీయ పార్టీల నేతలను కలవడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.