2019 ఎన్నికలకు ముందు సీఎం జగన్ ని ఎవరైనా పల్లెత్తు మాట అంటే అంతెత్తున విరుచుకుపడిపోయేవారు వైసీపీ నేతలు. అంబటి రాంబాబు, రోజా, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్.. ఇలా ఫైర్ బ్రాండ్స్ గా ముద్రపడిన నేతలంతా విమర్శకుల నోళ్లు మూయించేందుకు ముందు వరుసలో ఉండేవారు. మంత్రివర్గ కూర్పు తర్వాత జగన్ కి సపోర్ట్ గా నిలిచేవారు సంఖ్య క్రమంగా తగ్గింది. అంబటి, రోజా.. పూర్తిగా వెనక్కి తగ్గారు. మంత్రులు చూసుకుంటారులే మనకెందుకు అనే ధోరణిలో ఉండిపోయారు. అయితే మంత్రి వర్గం కూడా జగన్ కి పూర్తి స్థాయిలో రక్షణ కవచంలా ఉండలేకపోయిందనే మాట వాస్తవం. తాజాగా టీఆర్ఎస్ విమర్శలు, టీడీపీ అనుకూల మీడియాలో వస్తున్న కథనాలు జగన్ ఇమేజ్ ని డ్యామేజీ చేసేలా ఉన్నా.. వైసీపీ టీమ్ మౌనం వీడటంలేదు.