ఏపీలో రాజకీయ సమీకరణాలు సడన్ గా మారిపోయాయి. ఉన్నట్టుండి వైసీపీ నాయకులు బీజేపీని టార్గెట్ చేశారు. మంత్రులు కూడా బీజేపీపై నిందలు వేశారు. ఏపీలో ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. ఏపీలో వైసీపీ బలంగా ఉంది, రాగా పోగా టీడీపీ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉంది. అయినా ఆ పార్టీకి ఉన్న 23 సీట్లలో నలుగురు బయటకు వచ్చేశారు. మరికొంతమంది వస్తే చంద్రబాబుకి ప్రతిపక్షనేత హోదా కూడా పోతుంది. బీజేపీకి ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేదు. ఆ పార్టీ మిత్రపక్షం జనసేన పరిస్థితి కూడా అంతంతమాత్రమే. ఈ రెండు కలసినా ఏ స్థాయిలో జనబలం ఉందో ఇటీవల తిరుపతి ఉప ఎన్నికల్లో తేలిపోయింది. ఈ దశలో బీజేపీ వైసీపీకి పోటీ వస్తుందని ఎవరూ భావించలేరు. కానీ బీజేపీ కుట్ర చేస్తోందని, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పడేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శలు మొదలయ్యాయి.