జీవితమంతా భయపడుతూ, భయపెడుతూ బతకడమేనా ? అసలు ఈ భయం ఎందుకు ? భయం అనేదే అతి భయంకరమైన జబ్బు. ఏమీ జరగకముందే ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా వణికిపోయే జనాలు ఉన్నంత కాలం... కర్రను చూసినా పాములాగే కనిపిస్తుంది. అది కాటు వేయకపోయినా, కాటు వేస్తుంది అని ముందే భయపడి చావాల్సిందే. ఇక ఇప్పుడు కరోనా వైరస్ విషయంలోనూ అదే పరిస్థితి. చాలామంది ఈ వైరస్ విషయంలో జాగ్రత్తగా ఉంటూ వస్తుంటే... మరికొందరు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ చేజేతులా ఈ వైరస్ ను అంటించుకుంటున్నారు. ఈ కరోనా ప్రభావం ఇప్పట్లో పోయేది కాదు. మరికొంతకాలం మనతో పాటు ఉంటుంది. మాస్క్ లు కూడా మన జీవితంలో భాగస్వామ్యం అవుతాయని ఎప్పుడో జగన్ హెచ్చరించాడు. అప్పట్లో ఆయన మాటలు ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు అప్పటి మాటలను గుర్తు చేసుకుంటూ.. నిజమే అనుకుంటున్నారు.
ప్రస్తుతం కరోనా ప్రభావానికి గురైన వారి విషయంలో సమాజంలో ఏ విధంగా చిన్న చూపు ఉంది అనేది అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ సోకిన వారిని, వారి కుటుంబాన్ని వెలి వేసినట్టుగా చూస్తున్నారనే వార్తలు చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. ఇదంతా ఇలా ఉంటే అసలు ఈ కరోనా వైరస్ సోకిన వారి పరిస్థితి ఏంటి ? వారు పడుతున్న మానసిక ఆందోళన ఏంటి ? అనేది పరిశీలిస్తే చాలా విషయాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం కరోనా సోకినా వారు అందరిని, ఒక చోట ఉంచి వైద్యం చేస్తున్నారు. అందరికీ కరోనా లక్షణాలైన తుమ్ము, దగ్గు వంటి కారణంగా ఆ క్వారంటైన్ సెంటర్ లో పరిస్థితి నిత్యం భయం భయం గానే ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్లే వైద్యులు, సమయానికి భోజనం అందించే వారు తప్ప మిగతా అన్ని సమయాల్లో భయం భయం గానే జీవించే వారు ఎక్కువ.
అసలు ఈ కరోనా వైరస్ సోకిన వారిలో చాలామంది కోలుకుని బయటకి వచ్చే వారు కొంతమంది అయితే, మానసిక ఆందోళనతో మనో వేదనకు గురయ్యేవారు మరి కొంతమంది. పాజిటివ్ తో మరణించిన వారిలో కరోనా వైరస్ కారణంగా కంటే, ఎక్కువ మంది మానసిక ఆందోళనతో, ఏదో జరిగి పోతుంది అనే భయాందోళనతో మరణించిన వారు ఎక్కువ ఉన్నారు. ఇక ఈ చికిత్స పొందుతున్న వారిలో ఎవరైనా, కరోనాతో మరణిస్తే అక్కడ పరిస్థితి మరింత ఆందోళనకరం. మిగతా వారు తమకీ ఇదే పరిస్థితి వస్తుందనే భయంతో సగం చచ్చి పోతున్నారు. కరోనా వైరస్ చేసే నష్టం కంటే ఈ భయాందోళన కారణంగానే చనిపోయారు ఎక్కువ అవుతున్నారు. ఈ కరోనా ను ఎదుర్కోవాలంటే కావాల్సింది వైద్యంతో పాటు, మానసిక ధైర్యం కూడా.
ఇదంతా ఇలా ఉంటే, కొన్ని కొన్ని చోట్ల కరోనా వైరస్ రోగుల వార్డుల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. వైరస్ సోకిన రోగులు ఎంత ఆటపాటలతో ఆనందంగా గడుపుతున్న కొన్ని దృశ్యాలు, వీడియోలు సోషల్ మీడియాలో బయటకు రావడంతో వైరల్ అయ్యాయి. కొన్ని కరోనా సోకినా వారి వార్డుల్లో, అక్కడ చికిత్స పొందుతున్న వారంతా వివిధ ఆటలు ఆడుకుంటూ, ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ, ఆనందంగా గడుపుతూ వాటిని వీడియోలు తీసి బంధువులకు, స్నేహితులకు పంపుతూ ఉండడంతో, వారి కుటుంబ సభ్యుల్లో కూడా కాస్త ధైర్యం కనిపిస్తోంది. కరోనా సోకిన వారు బిక్కచచ్చిపోయి క్షణక్షణం భయం భయంగా ఉండే కంటే, ఇలా మానసిక ధైర్యాన్ని తెచ్చుకుని ఈ వ్యాధి సోకినా, ధైర్యంగా ఎదుర్కోగలము అనే ధీమాతో ఉండగలిగితే ఈ వైరస్ కాదు కదా, ఏ వైరస్ ఏమి చేయలేదు.
ఇలా ఆనందంగా ధైర్యంగా ఉంటే, తొందరగానే కోలుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక జనాల్లోనూ, ఈ వైరస్ పై అనవసర ఆందోళనలు తగ్గుతాయి. ముందు ముందు కరోనా వైరస్ ప్రభావం పెరిగే అవకాశం ఉండడంతో, ప్రజల్లోనూ, కరోనా వైరస్ బాధితులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది. దీనిపై మరింత ప్రచారం చేపట్టి ప్రజలకు అవగాహన కల్పిస్తే, అనవసర ఆందోళన తగ్గే అవకాశం ఉంటుంది అనేది నిపుణుల అభిప్రాయం.