తాజాగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలు 45 ఏళ్లు దాటిన వారికి 18,500 రూపాయలు ఖాతాల్లో వేశారు. మొత్తానికి జగన్ సర్కారు డబ్బులు పంచడంలో దేశంలోనే నెంబర్ వన్ గా కనిపిస్తోంది. జగన్ పాదయాత్రలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం వైయస్ఆర్ ఆసరా పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు తాజాగా ప్రకటించారు. నవరత్నాల్లో భాగంగా మరో హామీ అమలు చేసే దిశగానే వైయస్సార్ ఆసరా పథకం ప్రారంభిస్తారట.
ఈ వైయస్ఆర్ ఆసరా ద్వారా నాలుగేళ్లలో 27వేల కోట్లకుపైగా డ్వాక్రా మహిళలకు పంచుతారట. ఈ వైయస్ఆర్ ఆసరా పథకాన్ని ఏర్పాటు చేసి ఆ పథకం ద్వారా 2019 ఏప్రిల్ 11న రాష్ట్రంలో ఉన్నటువంటి సక్రమంగా అప్పులు చెల్లించే గ్రూపులకు ఆరోజు ఎంత అయితే గ్రూపు మొత్తానికి లోన్ ఉందో.. ఆ లోన్ మొత్తాన్ని నాలుగు విడతలుగా డ్వాక్రా మహిళల అకౌంట్లలో జమ చేస్తామని సీఎం చెప్పిన మాట మేరకు వైయస్ఆర్ ఆసరా పథకం తీసుకువస్తున్నారు.
ఈ వైఎస్సార్ ఆసరా ద్వారా ద్వారా రాష్ట్రంలోని 9,33,180 డ్వాక్రా మహిళా సంఘాలకు లబ్ధి చేకూరుతుందట. 2020-21 సంవత్సరంలో పథకం ప్రారంభించే మొదటి సంవత్సరానికి రూ.6792 కోట్ల మేర డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరుతుందట. వైయస్ఆర్ ఆసరా పథకం మొత్తానికి సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం ఖర్చు చేయడానికి నిర్ణయించిన మొత్తం రూ.27,168.83 కోట్లుగా అంచనా వేస్తున్నారు. డ్వాక్రా మహిళలను ఆర్థికంగా గ్రూపులను పరిపుష్టి చేయడం ద్వారా వారి కుటుంబాలు ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తాయనేది జగన్ ధీమాగా చెబుతున్నారు వైసీపీ నాయకులు.