కేసీఆర్ - అంతులేని ప్రేమా.. అవసరార్థ ప్రేమా..?
ఒక్కసారి గతంలోకి వెళ్తే.. ఈ కేసీఆర్ అంతులేని దళిత ప్రేమ కొత్తదేమీ కాదు.. ఇది ఇప్పటికే ఆయన అనేకసార్లు వాడేసిన థీమే.. ఉద్యమ సమయంలోనే ఆయనకు దళితులపై అంతులేని ప్రేమ పుట్టుకొచ్చింది. అంతే.. తెలంగాణ వస్తే.. మొదటి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడని అనేకసార్లు ఆయన ఘంటాపథంగా చెప్పారు.. మాట తప్పితే మెడకాయ మీద తలకాయ కోసుకుంటాననడం కేసీఆర్ కు కొత్త కాదు కదా. ఆ తర్వాత తెలంగాణ వచ్చింది.. కానీ దళితుడు మొదటి ముఖ్యమంత్రి కాలేదు.
ఎందుకు దళితుడిని మొదటి ముఖ్యమంత్రిని చేయలేదని గట్టిగా కేసీఆర్‌ను నిలదీసిందీ లేదు. కష్టపడి సాధించుకున్న రాష్ట్రం.. మరి సరైన నాయకత్వం లేకపోతే ఇబ్బందవుతుందని కేసీఆర్ కాస్త సర్ది చెప్పారు. అలా కేసీఆర్ మొదటి దళిత ప్రేమ అటకెక్కింది. ఇక ఆ తర్వాత మరికొన్నాళ్లకు కేసీఆర్‌కు దళితులపై అంతులేని ప్రేమ పుట్టుకొచ్చింది. అంతే.. దళితులకు మూడెకరాల భూమి ఇస్తాం.. భూమి లేని దళితుడు ఉండకూడదు.. భూమి ఉంటే దళితులకు గౌరవం ఆటోమేటిగ్గా అదే వస్తుందన్నారు. కానీ ఆ హామీ కూడా అమల్లోకి రాలేదు. అదేమంటే అబ్బో.. భూముల రేట్లు మామూలుగా లేవు కదా అంటున్నారు.
ఇక ఇప్పుడు హూజూరాబాద్ ఎన్నికల సమయంలో కొత్తగా మరోసారి కేసీఆర్‌కు దళితులపై అపరిమితమైన అవాజ్యమైన అనంతమైన ప్రేమ ముంచుకొచ్చింది. అందుకే ప్రతి దళిత ఇంటికి రూ.10 లక్షలు ఇస్తామంటూ దళిత బంధు తెస్తున్నారు. మరి ఈ ప్రేమ అయినా నిలుస్తుందా.. కేవలం అవసరార్థ ప్రేమగా మరోసారి మిగిలిపోతుందా.. చూద్దాం..