నితిశ్, లాలూ ఇద్దరూ స్నేహితులా.. శత్రువులా.. చెప్పడం కష్టం. అందుకే వారిని స్నేహ శత్రువులు అని పిలిచుకోవచ్చు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ నేత నితీశ్ కుమార్‌ ఇద్దరూ దేశంలోనే పేరున్న నాయకులు.. ఇద్దరూ స్నేహ శత్రువులు.. ఈ ఇద్దరూ 1970లలోనే రామ్‌ మనోహర్‌ లోహియా స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమ సమయంలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.


అప్పట్లో యువ నాయకులైన ఈ ఇద్దరు బీహారీలు జైలుకు కూడా వెళ్లివచ్చారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో జైలు ఊచలు లెక్కబెట్టారు. ఆ తర్వాత ఇద్దరూ జార్జ్ ఫెర్నాండెజ్ వంటి మహామహులు ఉన్న జనాతా దళ్‌ పార్టీలో చేరారు. 1997 వరకూ ఇద్దరూ అదే పార్టీలో కలిసి పని చేశారు. అంతవరకూ అంతా బాగానే ఉంది. అప్పడు వారిద్దరూ స్నేహితులే..ఆ తర్వాత లాలూ జనతాదళ్ నుంచి వేరుపడి రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ పెట్టినప్పుడే ఇద్దరి మధ్య రాజకీయ శత్రుత్వం మొదలైంది.


అదే సమయంలో నితీశ్ బీజేపీతో స్నేహం వైపు మొగ్గాడు. అంతే అప్పటి నుంచి లాలూ, నితీశ్ ఇద్దరి మధ్యా రాజకీయ శత్రుత్వం ముదిరింది. ఇది దాదాపు రెండు దశాబ్దాలు సాగింది. అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని చెబుతున్న మాటను లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ యాదవ్ ఇద్దరూ 2015లో మరోసారి రుజువు చేశారు. 2015లో నితీశ్ కుమార్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్నప్పడు అనూహ్యంగా ఆయన మరోసారి లాలూతో చేయి కలిపారు. జేడీయూ, ఆర్జేడీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు.


అయితే ఈ స్నేహం ఎక్కువ కాలం నిలవనే లేదు. రెండేళ్లలోనే మరోసారి నితీశ్, లాలూ దారులు వేరయ్యాయి. అప్పట్లో నితీశ్ కేబినెట్లో మంత్రులుగా ఉన్న లాలూ కుమారులపై అవినీతి ఆరోపణలు రావడంతో నితీశ్ ఆర్జేడీతో బంధం తెంపుకున్నారు. మల్లీ బీజేపీ వైపు చేరారు. ఇలా దాదాపు ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో నితీశ్, లాలూ.. ఇద్దరు స్నేహితులా, శత్రువులా అంటే చెప్పడం కష్టం.. స్నేహ శత్రువులు అన్న పదమే వీరికి సరిపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: