భారత దేశం చాలా పెద్ద దేశమని.. ఇంతటి దేశానికి అన్నం పెట్టాలంటే.. చాలా ప్రణాళిక అవసరమని ఇటీవల కేసీఆర్ తరచూ చెబుతూ వస్తున్నారు. దేశానికి అన్నం పెట్టే ప్రణాళికలు అమలు చేయడంలో మోదీ విఫలం అవుతున్నారని కూడా కేసీఆర్ రాజకీయ వేదికలపై మోదీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రాన్ని దోషిగా నిలబెట్టాలని సీఎం కేసీఆర్ కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. పండిన ధాన్యం మొత్తం కొనకపోతే.. జాతీయ ఆహార భద్రతా లక్ష్యానికి దెబ్బ తగులుతుందని కేసీఆర్ చెప్పడం జాతీయ ప్రయోజనాల కోసం తాము ప్రయత్నిస్తున్నామని చెప్పకనే చెబుతున్నారు.
ఇప్పటికే ఈ అంశంపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. సీఎంగా 8 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న కేసీఆర్.. మొదట్లో ప్రధాని మోడీతో సఖ్యతగానే ఉన్నారు. మొదటి విడత పాలనలో పెద్దగా కేంద్రంతో ఘర్షణ వైఖరి లేదు.. రెండో విడతలోనూ మొదట్లో పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. కానీ.. కొన్ని నెలలుగా కేంద్రంపై, బీజేపీపై కేసీఆర్ పూర్తి వ్యతిరేకతగా ఉన్నారు. తెలంగాణలో బీజేపీ ఫామ్‌లోకి వస్తుందన్న విషయాన్ని గ్రహించిన కేసీఆర్.. ఆ పార్టీని టార్గెట్ చేసుకున్నారు. అయితే.. ఇదంతా పొలిటికల్ గేమ్ అని.. కాంగ్రెస్ పార్టీ ఎదగకుండా కేసీఆర్ కావాలనే బీజేపీతో యుద్ధాన్ని ప్రమోట్ చేస్తున్నారన్న వాదన కూడా ఉంది.