ఏపీలో వాలంటరీ వ్యవస్థను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఎన్నికల్లో విజయం సాధించగానే మొదట వాలంటరీ వ్యవస్థపై దృష్టి సారించి రాష్ట్రమంతా విస్తరింపజేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా ఈ వ్యవస్థ పనిచేస్తుందని చెబుతూ వచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వాలంటీర్లే కీలక భూమిక పోషిస్తున్నారు. అయితే వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.


ఇదిలా ఉండగా వాలంటీర్ వ్యవస్థ బాగుందని తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని పలు రాష్ట్రాలు ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు కేరళ కూడా ఈ జాబితాలో చేరింది.  కేరళలోని కమ్యూనిస్టుల ప్రభుత్వం ఏపీలో మాదిరిగా వాలంటీర్లను నియమించింది. ఇక్కడ అయితే వాలంటీర్లను పరీక్షలు పెట్టి ఎంపిక చేశారు. కేరళలో మాత్రం నేరుగా నియమించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు తీసుకునేలా ప్రోత్సహించడం.. అర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేయడం వంటివి చేస్తున్నారు. ఇవి అక్కడ కూడా సత్ఫలితాలనిచ్చింది.


ఇప్పుడు కేరళ ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను పరిశీలిస్తోంది. గతంలో చంద్రబాబు హయాంలో ప్రజల వద్దకు పాలన అంటూ నెల, రెండు నెలలకోసారి అధికారులు ప్రజల వద్దకు వచ్చి వాళ్ల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేవారు. ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేసేవారు. ఇప్పుడు 2 వేల మందికి ఓ గ్రామ సచివాలయం ఏర్పాటు చేశారు. దీంతో ప్రజల పనులు సులభతరం అయ్యాయి. ధ్రువపత్రాల కోసం ఎమ్మార్వో కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా పోయింది.


ఇక్కడి సేవలు పరిశీలించేందుకు కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్ర్షన్ సంస్థ ప్రతినిధులు ఏపీలోని గ్రామాలను పరిశీలించారు. ఇక్కడి సేవలపై ఆరా తీశారు. సచివాలయ ఉద్యోగులతో సమావేశమై వారి బాధ్యతలు, అందించే సేవలను అడిగి తెలుసుకున్నారు. పాత రికార్డులను భద్ర పరచడంపై కూడా దృష్టి సారించారని తద్వారా విలువైన సమాచారం పంచాయతీల్లోనే తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. మొత్తంగా ఏపీలోని సచివాలయ  వ్యవస్థ బాగా పనిచేస్తోందని కితాబిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: