- బీఆర్ఎస్ నేతలను కలవడం పట్ల తీవ్ర అసహనం
- అధినేత చంద్రబాబును దూషించిన వారిని కలవడం ఏంటంటూ ఆవేదన
- సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కార్యకర్తలు

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఎంతో పవిత్రమైన, హిందువుల ఆరాధ్య దైవమైన వేంకటేశుని సన్నిధి తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి చైర్మన్గా ఇటీవల నియమితులైన బి ఆర్ నాయుడు తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. పదవీ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన తెలుగు రాష్ట్రాల్లోని పలు రంగాల ప్రముఖులను కలుస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు సహా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా కలిసి సత్కరిస్తున్నారు. ఇప్పుడు ఇదే తెలుగు తమ్ముళ్ల అసహనానికి కారణమవుతోంది. 2019- 24 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఒకరకంగా జీవన్మరణ పోరాటాన్ని సాగించిందని చెప్పొచ్చు. ఆ సమయంలో నాటి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. నాడు తెలంగాణ లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పరోక్షంగా సహకరించిందన్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా పలు సందర్భాల్లో గులాబీ పార్టీ అధినేత, ఆయన కుమారుడు, మేనల్లుడు సహా అప్పటివరకు తెలుగుదేశం పార్టీ పునాదులపై నిలిచి.. రాజకీయంగా ఎదిగి గులాబి జెండా పట్టిన నేతలు సైతం చంద్రబాబును దూషించారు.


ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు  అరెస్టు అయ్యారు. ఆయన అరెస్టు వెనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఉన్నాయన్నది బహిరంగ సత్యమే. ఒక విజనరీ లీడర్ ని అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న నేతలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు నిరసన గళాన్ని వినిపించారు. కానీ పోరుగు రాష్ట్రమైన తెలంగాణలో నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు మాత్రం నోరు విప్పలేదు. పైగా చంద్రబాబు అరెస్టుకు తమకు సంబంధం ఏంటంటూ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఎక్కడో ఆంధ్రాలో చంద్రబాబు అరెస్ట్ అయితే ఇక్కడ ఆందోళన చేయడమేంటి? ఏదైనా ఉంటే అక్కడే చేసుకోండి అంటూ హైదరాబాదులో ఆందోళన చేస్తున్న ఐటీ ఉద్యోగులు, చంద్రబాబు అభిమానుల పట్ల దురుసుగా మాట్లాడారు. ఒక దశలో ఆందోళనలను జరగనీయకుండా పోలీసు బలగాలను రంగంలోకి దించారు. అయినప్పటికీ తెలుగు తముళ్ళు,  ఐటి ఉద్యోగులు, చంద్రబాబు అభిమానులు మాత్రం వెనక్కి తగ్గలేదు. కానీ తమ అభిమాన నాయకుడి పట్ల బీఆర్ఎస్ నాయకులు మరీ ముఖ్యంగా కేటీఆర్ మాట్లాడిన తీరును మాత్రం జీర్ణించుకోలేకపోయారు.


రాజకీయాల మాటా ఎలా ఉన్నా.. సాటి తెలుగువాడిగా, తన తండ్రి కెసిఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ అల్లుడుగా, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిగా అయినా చంద్రబాబుకు మర్యాద ఇవ్వలేదని తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. నాడు బీఆర్ఎస్ నేతలు మాటలను గుండెల్లోనే దాచుకున్న తెలుగు తమ్ముళ్లు ఆ కోపాన్ని అసెంబ్లీ ఎన్నికల వేదికగా చూపారు. పార్టీ మారినప్పటికీ తమ అధినేత పట్ల గౌరవభావంతో ఉన్న రేవంత్ రెడ్డినీ తమ వాడిగానే భావించి.. కాంగ్రెస్‌కు బహిరంగంగానే మద్దతు పలికారు. తమ పార్టీ అభ్యర్థులు బరిలో లేకపోయినప్పటికీ.. చెప్పుకోదగిన స్థాయిలో ఓటు బ్యాంకు లేకపోయినప్పటికీ.. టిడిపి కార్యకర్తలు,  నాయకులు కసితో ముందుండి బీఆర్ఎస్ ని గద్దె దించడమే లక్ష్యంగా.. కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పనిచేశారు. బహిరంగంగానే తెలుగుదేశం జెండాలు పట్టుకొని కాంగ్రెస్‌కు ఓటేయాలంటూ ప్రచారంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి బలమైన పునాదులు ఉన్న  ఉమ్మడి ఖమ్మం జిల్లా తో పాటు కోదాడ, సూర్యాపేట తదితర నియోజకవర్గాల్లో ఇది స్పష్టంగా కనిపించింది.


* నాయుడు పై ఆగ్రహం ఎందుకంటే..
వైసీపీ అరాచక పాలనను ఐదేళ్లపాటు ఎదుర్కొని.. ఎన్డీఏ కూటమి గా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకమైన టిటిడి చైర్మన్ పదవిని ఓ మీడియా ఛానల్ అధిపతి అయిన బి ఆర్ నాయుడుకు అప్పగించారు. వివాద రహితుడుగా, వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడిగా పేరు ఉన్న నాయుడుకి ఆ పదవి ఇవ్వడం పట్ల తెలుగు తమ్ముళ్లు సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రముఖులను కలిసే పేరుతో వారి ఇళ్లకు వెళ్లి వారికే సత్కారాలు చేయడం వారిని అసంతృప్తికి గురిచేస్తోంది. ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రానికి చైర్మన్గా ఉన్న వ్యక్తి ఇలా గడపగడపకు వెళ్లడం ఏంటని..? పైగా చంద్రబాబు నాయుడుపై సందర్భాల్లో నోరు పారేసుకున్న బీఆర్ఎస్ ముఖ్య నేతలను కలవడం ఆయన స్థాయికి తగినది కాదంటూ సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ గడపగడపకు వెళ్లే కార్యక్రమానికి పుల్ స్టాప్ పెట్టాలని కోరుతున్నారు. దీనిపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరుతున్నారు. ఏది ఏమైనా బిఆర్ నాయుడు తీరు కార్యకర్తలు, అభిమానులను అసహనాన్ని గురి చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd