ఏపీ రాజధాని ఏది అంటే ఏమో అనేలా ఉండేది గత అయిదేళ్ల వైసీపీ ఏలుబడిలో పరిస్థితి. ఇలా ఎందుకు అంటే మూడు రాజధానులు అంటూ నాడు వైసీపీ ప్రభుత్వం చేసిన రాజకీయ విన్యాసం ఆ రేంజిలో ఉంది మరి అంటారు. ఆఖరికి రాజధాని ఏపీకి ఉందా లేదా అన్నది కూడా అర్థం కాకుండా పోయింది. అదొక జోక్ గా కూడా అంతా చెప్పుకునే విషాదంగా మారింది.
2014లో విభజన ఏపీలో తొలిసారి సీఎం గా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు చాలా దూరదృష్టిలో అమరావతి రాజధాని నిర్మాణానికి తలపెట్టారు. పేరెన్నిక గన్న ప్రఖ్యాత సంస్థలను అమరావతి రాజధానికి రప్పించి పెట్టుబడులు పెట్టించారు. వారికి భూ కేటాయింపులు చేశారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగే ఈ పాటికి అమరావతి ఒక రూపునకూ షేపునకూ వచ్చేది అని అంటున్నారు.
2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధానిని కదపాలని చూసింది. మూడు ప్రాంతాల ప్రజల మనోభావాలతో వైసీపీ రాజకీయం చేసిందని ప్రత్యర్ధి పార్టీలు చేసిన ప్రచారమే జనాగ్రహానికి కారణం కూడా అయింది. మొత్తానికి వైసీపీని ఘోరంగా మూడు ప్రాంతాలలోనూ ఓడించేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తన తొలి ప్రాధాన్యత అమరావతి మీదనే ఉంచింది. కేంద్రం నుంచి అమరావతికి ప్రపంచ బ్యాంక్ నుంచి 15 వేల కోట్ల నిధులను మంజూరు చేయించుకుంది. వివిధ ఏజెన్సీల ద్వారా ఇంకో 12 వేల కోట్ల రూపాయలను కూడా నిధులను సేకరిస్తోంది.
దాదాపుగా 30 వేల కోట్ల రూపాయల నిధులతో అమరావతి రాజధానిని 2027 నాటికల్లా ఒక షేప్ కు తీసుకురావాలని టీడీపీ కూటమి తలపోస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే అమరావతి రాజధాని అని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ అయితే ఇప్పటిరాకా రిలీజ్ చేయలేదు. దాని మీద విశాఖకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ఒకరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.
డిసెంబర్ నెలాఖరులోగా అమరావతి ఏపీకి రాజధాని అని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. అదే కనుక జరిగితే అమరావతికి అదే అతి పెద్ద రాజముద్ర గా ఉంటుంది అని అంటున్నారు. అమరావతి రాజధానిని ఇక మీద ఎవరు అధికారంలోకి వచ్చినా కదిపేందుకు వీలు ఉండదని అంటున్నారు.
ఆ విధంగా గట్టి బిగింపులతోనే కూటమి ప్రభుత్వం అమరావతిని ఏపీకి శాశ్వత రజాధానిగా చేయబోతోంది. దాని వల్ల పెట్టుబడులు పెట్టే వారికి పరిశ్రమలు స్థాపించేవారికి కూడా పూర్తి స్థాయిలో నమ్మకం వస్తుందని అంటున్నారు. ఒక్క గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే చాలు అమరావతి అభివృద్ధి పరుగులు పెడుతుందని అంటున్నారు.