సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి స్పెషల్ స్టోరీ...!

Reddy P Rajasekhar

తెలుగు జాతి గర్వించదగిన మహోన్నత వ్యక్తులలో కందుకూరి వీరేశలింగం ఒకరు. ఆయన తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు. బాల్య వివాహాల రద్దు కోసం ఉద్యమించిన మహోన్నతుడు, సంఘ సంస్కర్త. ఆయన 1848వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించారు. స్త్రీ విద్య కోసం ఉద్యమించిన వీరేశలింగం బాలికల కోసం పాఠశాలను స్థాపించారు. బ్రిటిష్ హయాంలో జరుగుతున్న బాల్య వివాహాలకు నిరసనగా ఆయన ఉద్యమమే నిర్వహించారు. 
 
సామాజిక దురాచారాల నిర్మూలన కోసం వీరేశలింగం ఎంతో కృషి చేశారు. ఆయన ఆధునిక ఆంధ్ర పితామహుడిగా కీర్తి గడించారు. దేశంలో మొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి వీరేశ లింగం కావడం గమనార్హం. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ఆయనే ప్రవేశపెట్టారు. విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పడంతో పాటు పుస్తకాలు, పలకా బలపాలను కొనిచ్చేవారు. 
 
యుగకర్తగా, హేతువాదిగా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు కూడా ఉంది. మొదటి స్వీయ చరిత్ర, తొలి నవల, తొలి ప్రహసనం, తొలి తెలుగు కవుల జీవిత చరిత్ర రాసిన మొదటి వ్యక్తిగా ఆయన ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆయన ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించారు. సమాజ సేవ కోసం హితకారిణి అనే ధర్మ సంస్థను స్థాపించి తన యావదాస్తిని వీరేశలింగం ఆ సంస్థకు ఇచ్చేశారు. 
 
ఆయన జయంతిని నాటక రంగ దినోత్సవంగా జరుపుకుంటారు. ఆయన 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితునిగా పని చేశారు. తెలుగు పండితుడిగా మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో ఐదేళ్లు పని చేశారు. తెలుగులో 130కి పైగా గ్రంథాలను రాశారు. సత్యరాజ పూర్వ దేశయాత్రలు, రాజశేఖర చరిత్ర ఆయన రచనలలో ముఖ్యమైనవి. ఆయన ప్రభుత్వంలో అవినీతిని ఏవగించుకుని ప్రభుత్వ ఉద్యోగి ప్రయత్నాన్ని, అబద్ధాలు ఆడక తప్పదని న్యాయవాద వృత్తిని వదులుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: