దేశ ప్రధాని కావడం అంటే చిన్న విషయమేమీ కాదు, కోట్లాది ప్రజలకు మార్గదర్శిగా మారి పాలన సాగించాల్సి ఉంటుంది. ప్రజల నాడి సరిగ్గా పట్టుకున్న నాయకుడే ఎక్కువ కాలం సింహాసనంపై పాలన సాగించగలరు అన్నది అక్షర సత్యం. లేదంటే ఓటు వేసి గెలిపించిన అదే ప్రజలు తదుపరి ఎలక్షన్ సమయంలో గద్దె దించేందుకు ఏమాత్రం వెనుకాడరు. అందుకనే ముందుగా నాయకులు ప్రజల మనసును చదవాల్సి ఉంటుంది, వారి కష్టాలను గమనించి భవిష్యత్తు తీర్చిదిద్దాల్సి ఉంటుంది, అభివృద్ధి పథంలో దేశాన్ని ముందుకు నడిపే నాయకుడిగా అన్ని బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలో కొన్ని తప్పులు దొర్లడం సహజమే. కానీ విపత్కర పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయాలు సరిగా లేనట్లైతే దేశ ప్రజలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇది ప్రజల ప్రాణాలకే ముప్పు కావచ్చు. ప్రస్తుతం భారతదేశం అలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటోంది అంటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు.