చాలామంది విద్యార్థులు పరీక్షల పేరు వినిపిస్తే చాలు భయాందోళనకు గురవుతూ ఉంటారు. పరీక్షల ముందు ఆందోళనకు గురవుతున్నాం... అన్నీ మరిచిపోతున్నాం... పరీక్ష హాల్లోకి వెళ్లిన తరువాత ఏమీ గుర్తుండటం లేదు... అని తరచుగా విద్యార్థులు చెబుతూ ఉంటారు. పరీక్షలంటే భయపడేవారు పరీక్షకు ముందు రెండు, మూడు నిమిషాలు పిడికిలి బిగించి శ్వాస వదలాలి. ఇలా చేస్తే టెన్షన్ తగ్గి భయం పోతుంది.
భయం, నెగిటివ్ ధోరణి ఉన్నవారు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. జవాబులను బట్టీ పట్టకుండా సబ్జెక్టును పెంచుకుంటే పరీక్షలలో ఎలాంటి ప్రశ్న ఇచ్చినా సమాధానాలను రాయగలమని గుర్తుంచుకోవాలి. పరీక్షల ముందు భయాన్ని వీడి ప్రశాంతంగా ఉండాలి. భయం, ఆందోళన, కంగారు అనే మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. భయాన్ని పూర్తిగా వీడి పరీక్షలకు సిద్ధమైతే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది.
పరీక్షల సమయంలో అనవసరమైన భయాలతో కాలాన్ని ఎట్టి పరిస్థితులలోను వృథా చేయకూడదు. ముందున్న పరీక్ష భయాన్ని, భారాన్ని తరిమేయాలంటే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకున్న వారికి మాత్రమే జీవితం పూలబాట పరుస్తుందని గుర్తుంచుకోవాలి. భయాన్ని వీడి పరీక్షలు రాస్తే విజయం తప్పక సొంతమవుతుందని గుర్తుంచుకోవాలి.