నిజానికి రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇదొక ఫిక్షనల్ స్టోరీ అని.. అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ కొన్ని రోజులు కనిపించకుండా పోయిన పీరియడ్ లో ఇద్దరూ కలిసి పోరాడితే ఎలా ఉంటుందనే ఐడియా ఇదని.. దేశభక్తి కంటే వారి మధ్య ఉండే స్నేహం గురించి ప్రధానంగా చెప్పబోతున్నానని చెప్పుకుంటూ వచ్చాడు. అందులోనూ 'భీమ్ ఫర్ రామరాజు'లో చరణ్ ని పోలీసుగా చూపించిన రాజమౌళి.. 'రామరాజు ఫర్ భీమ్' వీడియోలో తారక్ ని ఒక ముస్లిమ్ యువకుడిగా చూపించాడు. ఇద్దరినీ యుద్ధవీరులుగా చూపిస్తూ రామరాజు - భీమ్ సోదరభావంతో మెలుగుతుంటారనే విషయాన్ని టీజర్స్ తో వెల్లడించారు.అంతేకాకుండా చరణ్ ని నిప్పుల్లో చూపించిన రాజమౌళి.. ఎన్టీఆర్ ని నీళ్లలో చూపించాడు.  రెండు వీడియోలలో ప్రతి ఫ్రేమ్ లో నీటికి నిప్పుకి ప్రతీకగా నిలిచే షాట్స్ తో వేరియేషన్ చూపించాడు. ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో కూడా ఈ తేడా స్పష్టంగా కనిపించేలా డిజైన్ చూపించాడు. దీంతో ఎవరూ ఊహించనిది తెరపై చూపించే జక్కన్న ఈసారి ఏం చెప్పబోతున్నాడో అని అందరికి ఆత్రుత మొదలైంది.