RRR  తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఈ ప్రాజెక్ట్ ఇప్పటివరకు సెట్స్ పైకి వెళ్ళలేదు. ఎందుకంటే తారక్ ముందు 'RRR' షూటింగ్ పూర్తి చేయాలి.  ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. ఆ లోపు త్రివిక్రమ్ ఎన్టీఆర్ కోసం ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే అప్పటిదాకా త్రివిక్రమ్ మరో హీరోతో సినిమా చేయబోతున్నడంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. అందులో ముఖ్యంగా వెంకటేష్ నుంచి రామ్ వరకూ చాలా పేర్లు వినిపించాయి. చివరికి రామ్ ఖాయం అయ్యాడని చెప్పుకున్నారంతా. ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ పనులు పూర్తి చేసేలోగా.. త్రివిక్రమ్ మరో సినిమా అవ్వగొట్టేస్తాడని భావించారు. అయితే. త్రివిక్రమ్ ప్లాన్ మార్చాడు. ఎన్టీఆర్ అందుబాటులోకి వచ్చేలోగా ఏ సినిమా చేయకూడదని భావిస్తున్నాడట.ఈలోగా.. కేవలం ఎన్టీఆర్ కథపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నాడట. ఎన్టీఆర్ కంటే ముందుగా మరో హీరోతో సినిమా చేస్తే, ఆ సినిమా అటూ ఇటూ అయితే, ఆ ప్రభావం ఎన్టీఆర్ సినిమాపై పడుతుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. అలాంటి ప్రమాదాలేం లేకుండా. ఎన్టీఆర్ సినిమాపై క్రేజ్ తగ్గకుండా ఉండేందుకు త్రివిక్రమ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో ఈ వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది.