టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల మానిఫెస్టో విడుదల కోసం సోమవారం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీని ఆదుకోవడం కోసం తీసుకోబోతున్న చర్యలను గురించి స్పష్టంగా చెప్పారు..ముంబై, చెన్నై, హైదరాబాద్.. ఈ మూడు ప్రాంతాలు చిత్ర పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్నాయని కేసీఆర్ అన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో దాదాపుగా 40 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని.. వీరిలో 16 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారన్నారు. సినీ పరిశ్రమ పూర్తిగా పనిచేయడం ఆగిపోయింది కాబట్టి రోజువారీ వేతనానికి పనిచేసే కార్మికుల పరిస్థితి దారుణంగా మారిందని కేసీఆర్ చెప్పారు. ఈ 40 వేల మంది సినీ కార్మికులకు హెల్త్ కార్డులు, రేషన్ కార్డులు సహా సామాన్య ప్రజలకు అందించే అన్ని సదుపాయాలు అందిస్తామని సీఎం కేసీఆర్ అనౌన్స్ చేశారు.అంతే కాకుండా సినిమా థియేటర్లు ఏప్రిల్ నెల నుంచే పూర్తిగా మూతబడి ఉన్నాయి కాబట్టి అప్పటి నుంచి మళ్లీ తెరుచుకునేంత వరకు కరెంట్ బిల్లులు రద్దు చేస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు.