ఫోక్ సింగర్ మంగ్లీ తన పాటలతో తెలుగులో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. బంజారా జాతికి చెందిన మంగ్లీ అటు శాస్త్రీయ సంగీతంలోనూ ఇటు జానపదాలతోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇక మంగ్లీ ప్రతి పండగకు ఓ పాటను విడుదల చేయడం...ఆ పాట యూట్యూబ్ లో మారు మోగిపోవడం సాధారణమే. ఇప్పటి వరకూ మంగ్లీ విడుదల చేసిన ఎన్నో పాటలకు మిలియన్స్ వ్యూవ్స్ వచ్చాయి. బతుకమ్మ, బోనాలు, శివరాత్రి ఇలా అన్ని పండగలకు మంగ్లీ పాటలు విడుదల చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే మంగ్లీ ఈ యేడాది బోనాల సంధర్భంగా చెట్టు కింద కూసున్నవమ్మ అనే పాటను విడుదల చేశారు. ఇక ఈ పాట కూడా యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. అయితే ఈ పాట పై కొన్ని వివాదాలు తలెత్తడం కూడా ఇప్పుడు మంగ్లీకి తలనొప్పిగా మారింది. పాటలో మోతెవరి అంటూ అసభ్యపదజాలం వాడి అమ్మవారిని అవమానించారంటూ పలువురు ఆరోపిస్తున్నారు.