తెలంగాణలో బతుకమ్మ పండుగలో గౌరమ్మను కొలిచే సంప్రదాయం ఈనాటిది కాదు. పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం. తంగేడు, గునుగులు వాకిలంతా నిండి.. ఆటపాటలతో వీధులన్నీ తిరునాళ్లుగా మారితే అది బతుకమ్మ సంబరమే. ప్రతీ సంవత్సరం విజయదశమి పండుగకు ముందు వచ్చే అమవాస్య(పితృ అమవాస్య) రోజు బతుకమ్మ పండుగ సంబురాలు మొదలవుతాయి. ప్రారంభం రోజు జరుపుకునే బతుకమ్మను ఎంగిపూల బతుకమ్మ అని, చివరి రోజు జరుపుకునే బతుకమ్మను సద్దుల బతుకమ్మ అంటూ వ్యవహరిస్తారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ బతుకమ్మ పండుగ కేవలం తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొదలు కొని దేశ, విదేశాలలో సైతం బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందింది.