తెలంగాణ సీఎం కేసీఆర్ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం సెన్సార్ వద్ద ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కేసీఆర్ జీవితం ఆధారంగా నిర్మిస్తున్న ఉద్యమ సింహం సినిమాకు సెన్సార్ కొన్ని అభ్యంతరాలు తెలిపింది. ఈ సినిమాలో కాంగ్రెస్ అగ్రనేతల ఫోటోలు వాడటం వివాదాస్పదమైంది.
తెలంగాణ ఉద్యమంతో పాటు తెలంగాణ వచ్చిన తరవాత కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఘటనలు కూడా ఈ సినిమాలో ఉన్నాయట. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు ఉదంతం కూడా ఈ సినిమాలో ఉన్నట్టు సమాచారం. ఈ సినిమాలోని కొన్ని సీన్లలో కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ ఫోటోలు వాడారట.
అంతే కాకుండా.. కొన్ని చోట్ల నేతల భుజాలపై కాంగ్రెస్ కండువాలు కూడా చూపించారట. ఈ సన్నివేశాలపై సెన్సార్ బోర్డు అభ్యంతరాలు తెలిపిందట. ఆ ఫోటోలు, కండువాలు ఉన్న దృశ్యాలు తొలగించాలని ఆదేశించిందట.
వాస్తవానికి ఈ సినిమాను తెలంగాణ ఎన్నికలకు ముందే విడుదల చేయాలని ప్రయత్నించారు. కానీ రాజకీయ పరమైన సినిమా కావడం వల్ల నిర్మాణంలో ఆలస్యం జరిగింది. ప్రస్తుతం తలెత్తిన సెన్సార్ ఇబ్బందులను అధిగమించి ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాత అల్లూరి కృష్ణంరాజు భావిస్తున్నారు.