సినిమా ఇండస్ట్రీలో టైటిల్ వివాదాలు పెరుగుతున్నాయి. ఆ సినిమా టైటిల్ మా మనోభావాలు గాయపరుస్తుందని కంప్లయింట్ చేసేవారు పెరిగారు. ఇటీవల విడుదలైన వాల్మికి సినిమా చివరి నిమిషంలో గద్దలకొండ గణేష్ గా టైటిల్ మార్చుకుని విడుదలైన సంగతి తెలిసిందే. హరీశ్ శంకర్ వంటి పెద్ద డైరెక్టర్లే ఇలాంటి వత్తిళ్లకు ఆందోళనలకు తలొగ్గాల్సిన పరిస్థితి.
తాజాగా ఓ చిన్న సినిమా డైరెక్టర్ కు ఇలాంటి సమస్య ఎదురవుతోంది. రాయలసీమ లవ్ స్టొరీ చిత్ర దర్శకుడు రామ్ రణధీర్ కు బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో పత్రికా ప్రకటన విడుదల చేసారు. రాయలసీమ లవ్ స్టొరీ ఈ నెల 27 న విడుదల అవుతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ మార్చాలని లేదంటే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరికలు చేస్తున్నారని, నేను సినిమానే ఆశ , శ్వాసగా బతుకుతున్న వాడ్ని అంటూ తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు దర్శకులు రామ్ రణధీర్.
వెంకట్ , హృశాలి , పావని హీరో హీరోయిన్ లుగా పంచలింగాల బ్రదర్స్ నిర్మించిన రాయలసీమ లవ్ స్టొరీ ఈనెల 27 న విడుదలకు సిద్దమైన నేపథ్యంలో వరుసగా కొంతమంది పనిగట్టుకొని ఫోన్ లు చేస్తూ బెదిరిస్తున్నారని వాపోయాడు.
నాకు దర్శకుడిగా ఇది మొదటి సినిమా , ఈ సినిమాపై నా జీవితం ఆధారపడి ఉన్న నేపథ్యంలో చిన్న సినిమాని అడ్డుకోవడానికి ఇలా హెచ్చరికలు రావడంతో తన సినిమాకు ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు సహకరించాలని, విడుదలకు అన్ని ఏర్పాట్లను చేసుకున్న తర్వాత ఇప్పుడు టైటిల్ మార్చడం అంటే మాకు ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహార మని , ఇప్పటికే రాయలసీమ లవ్ స్టోరీ పేరుతో పబ్లిసిటీ చేస్తున్నామని ఆవేదన వెలిబుచ్చాడు దర్శకుడు రామ్ రణధీర్. మరి ఈ సినిమా టైటిల్ వివాదం ఎక్కడి వరకూ వెళ్తుందో..?