ఓ భాషలో హిట్ అయ్యిందంటే.. మరో భాషలో మినిమం గ్యారంటీ అన్నది ఇండస్ట్రీ సూత్రం. అయితే ఇది అన్నిసార్లూ క్లిక్ అవ్వాలని లేదు. కానీ.. చాలా వరకూ విజయం సాధిస్తాయి. హిట్ కొట్టకపోయినా మరీ బొక్కబోర్లా పడవు. ఆ నమ్మకంతోనే పరభాషా కథలు, సినిమాలను మనవాళ్లు ఆహ్వానిస్తారు.
ఇలా 2019లోనూ పలు సినిమాలు పొరుగు నుంచి వచ్చి మన దగ్గర హిట్ కొట్టాయి. పిజ్జా దర్శకుడు కార్తిక్ సుబ్బురాజ్ 2012లో రూపొందించిన కల్ట్ క్లాసిక్ చిత్రం ‘జిగిర్తాండ’. దాన్నే ఈ ఏడాది ‘గద్దలకొండ గణేశ్’గా తెలుగులోకి తెచ్చారు. హీరో వరుణ్‌తేజ్‌ని మాస్ లుక్కులో చూపించడంలోనే కాదు... కథని జనరంజకంగా మలచడంలోనూ విజయం సాధించి సినిమాని హిట్ చేశాడు యువ దర్శకుడు హరీశ్ శంకర్. ఇదే టాప్ 1 టాలీవుడ్ రీమేక్ సినిమా.
ఇక టాప్ 2 టాలీవుడ్ రీమేక్ హిట్ సినిమా ఓ బేబీ.. మిస్ గ్రానీ అనే కొరియన్ చిత్రం కథని తీసుకుని తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్చి మెప్పించిన చిత్రం ఈ ఓ బేబీ. చక్కటి కథాకథనాలకు సమంత నటన కూడా తోడైంది. మంచి హిట్ గా నిలిచింది. నటనలో తనకు సాటి లేరని సమంత మరోసారి నిరూపించుకున్న సినిమా ఇది.
మరో టాప్ త్రీ చిత్రం.. ఎవరు.. ‘ది ఇన్విజిబుల్ గెస్ట్’ అనే హాలీవుడ్ చిత్రం స్ఫూర్తితో తీసిన చిత్రం ఈ ఎవరు. ఈ సినిమా ఆధారంగానే హిందీలో బద్లా కూడా వచ్చింది. అయినా.. ఎవరు.. ఈ రెండింటికీ భిన్నంగా తయారైంది. క్లాసిక్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఈ క్రైమ్ థ్రిల్లర్‌లంటే మేధావి ప్రేక్షకులనే కాదు.. బీ, సీ సెంటర్ ప్రేక్షకులకీ నచ్చేసింది.