నందమూరి నట‌సింహం బాలకృష్ణ కెరీర్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. బాలయ్య సీనియర్ దర్శకుడు బి.గోపాల్ కాంబినేషన్‌కు తిరుగులేని క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి బ్లాక్‌బ‌స్టర్ హిట్ సినిమాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో 2000లో సంక్రాంతి కనుకగా వచ్చిన సినిమా నరసింహనాయుడు. చిరంజీవి.. మృగరాజు, వెంకటేష్.. దేవి పుత్రుడు సినిమాలకు పోటీగా రిలీజ్ అయిన నరసింహనాయుడు సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. దక్షిణ భారతదేశ సినీ చరిత్రలోనే 105 కేంద్రాలలో 100 రోజులు ఆడిన తొలి సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది.


19 కేంద్రాలలో 175 రోజులు పూర్తిచేసుకుంది. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులోను మినీ.. అంబికా థియేటర్ నరసింహనాయుడు సినిమాతో ప్రారంభమైంది. అప్పటివరకు అంబికా థియేటర్ ఉండగా.. అదే కాంప్లెక్స్ లో మినీ అంబికా థియేటర్‌ను ప్రముఖ పరిశ్రామిక వేత్త‌ బాలయ్యకు అత్యంత సన్నిహితుడు అయిన నిర్మాత అంబికా కృష్ణ.. అంబికా మినీ థియేటర్ కట్టారు. నరసింహనాయుడు సినిమాతోనే ఈ థియేటర్ ప్రారంభమైంది. ఈ సినిమా 50 రోజుల వరకు ప్రతిరోజు 6 నుంచి 7 షోలు విజయవంతంగా ప్రదర్శించారు. ఒక్కోసారి అర్థరాత్రి ఆటలు, ఉదయం 6 షోలు కూడా ప్రత్యేకంగా వేసేవారు.


50 రోజుల వరకు అసలు టిక్కెట్లు దొరకలేదు. అలా 100, 150, 200, 275 రోజులు చివరకు 300 రోజులు మినీ అంబికా థియేటర్లో నరసింహనాయుడు సినిమా విజయవంతంగా ప్రదర్శితమైంది. ఆ తర్వాత ఈ సినిమా ఆడుతుండగానే అదే కాంప్లెక్స్‌లో అంబికా లిటిల్ పేరుతో మరో థియేటర్ కొత్తగా నిర్మించి అందులోకి షిఫ్ట్ చేశారు. అలా అంబికా కాంప్లెక్స్ లో విజయవంతంగా ఏడాది పాటు ఆడిన నరసింహనాయుడు.. ఆ తర్వాత ఏలూరులోని అప్పుడు టూటౌన్‌లో ఉన్న రమా మహల్ థియేటర్ కు షిఫ్ట్ చేశారు. ఆ థియేటర్లో కూడా 40 రోజులపాటు ఆడింది. అక్కడ నుంచి వేదరాజ్ థియేటర్‌కు మార్చారు. ఓవరాల్‌గా ఏలూరులో నరసింహనాయుడు సినిమా 400 కు పైగా రోజులు ప్రదర్శిత‌మైంది. ఏలూరు చరిత్రలో ఇదో అద్భుతమైన రికార్డుగా నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: