సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. చిన్న వయసులో తన కుటుంబంలో అనేక రకాల ఆర్థిక సమస్యలను ఎదుర్కొంది. ఆ కారణంతోనే 4వ తరగతిలోనే తన చదువును మానేసింది. సిల్క్ స్మితకు 14 ఏళ్ల వయసులోనే వివాహం చేశారు. పెళ్లి అనంతరం ఆమె జీవితం దుర్బరంగా మారింది. భర్తతో పాటు అత్తమామలు వేధించేవారు. అత్తింటి నుంచి వేధింపులు తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయి డబ్బు సంపాదించడం కోసం సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది.
మేకప్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరీర్ ప్రారంభించిన ఆమె నటన మీద ఇష్టాన్ని పెంచుకుంది. ఆ తర్వాత తన పేరును విజయలక్ష్మి నుంచి సిల్క్ స్మితగా మార్చుకుంది. 1979లో వందిక కారం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత 80వ దశకం నుంచి 90వ దశకం వరకు తెలుగుతో పాటు తమిళం, మలయాళం వంటి అనేక రకాల భాష చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అందించింది. టాప్ డ్యాన్సర్ గా రాణించి మంచి ప్రశంసలు అందుకుంది.
చిన్నచితక పాత్రలు చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కి స్టార్ నటిగా పేరు, ప్రఖ్యాతలు దక్కించుకుంది. ఆ కాలంలోనే స్టార్ హీరోలకు సమానంగా సిల్క్ స్మిత రెమ్యూనరేషన్ అందుకుంది. అంతేకాదు సిల్క్ స్మిత సగం కొరికిన యాపిల్ ను వేలం వేయగా లక్ష రూపాయలకు వేలంలో ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. అప్పట్లో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.