గ్రేటర్ ఎన్నికలపై తెలంగాణ సీఎం కేసీఆర్ మొండి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రులతో సమావేశం అయిన కేసీఆర్, గ్రేటర్ ఎన్నికలపై ముందుకే వెళ్తామని నిర్ణయించారట. ఆరు నూరైనా, ఎన్నికలు ఎప్పుడు పెట్టినా.. గెలుపు మనదేనని ఉపదేశించారట. మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కొం దరు ముఖ్యనేతలతో ప్రగతిభవన్లో భేటీ అయిన సీఎం కేసీఆర్ గ్రేటర్ ఎన్నికలను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. డివిజన్లవారీగా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలకు ఇన్చార్జీలుగా బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ఆయన నేతలకు సూచించారు.