రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల పంపిణీ కోసం 30,68,281 మంది అర్హులను ఎంపిక చేసి గతంలోనే సచివాలయాల నోటీసు బోర్డుల్లో జాబితాను పొందుపరిచారు. ఏవైనా కారణాలతో ఎక్కడైనా అర్హుల పేర్లు లబ్ధిదారుల జాబితాలో లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇలా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. 90 రోజుల్లోగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి స్థలాలు కేటాయిస్తామని ప్రకటించింది. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 66,518 ఎకరాల భూమిని సేకరించి లేఔట్లు వేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. చివరిలో దరఖాస్తు చేసుకుని అర్హులుగా ఎంపికైన 80 వేల మంది కోసం వచ్చే నెల 10లోగా స్థల సేకరణతోపాటు ప్లాట్ల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.