ఏలూరు, కృష్ణా, గోదావరి కాలువల్లోని నీటిని పరిశీలించగా హానికరమైన రసాయనాలు, క్రిమి సంహారకాల అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. పరిమితికి మించి వేల రెట్లు అధికంగా ఉన్నట్లు తేల్చారు. కృష్ణా కాలువలో తీసుకున్న లీటర్ నీటిలో 17.84 మిల్లీ గ్రాముల మెధాక్సీక్లర్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. సాధారణంగా ఈ రసాయనం 0.001 మిల్లీ గ్రాముల కంటే తక్కువగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉండే నీటిలో 17,640 రెట్లు అధికంగా మెధాక్సీక్లర్ ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధరణ అయింది. ఈ రసాయనం ప్రజల శరీరంలోకి వెళితే దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.