ఏపీలో నిరుద్యోగులకు తీవ్ర స్థాయిలో అన్యాయం జరిగిందని, ఇంకా జరుగుతూనే ఉందని ధ్వజమెత్తారు జనసేనాని పవన్ కల్యాణ్. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంలో ఏపీపీఎస్సీ ఉదాసీనంగా ఉంటోందని, అందుకే నిరుద్యోగులంతా రోడ్డున పడుతున్నారని మండిపడ్డారాయన. జగన్ అధికారంలోకి రాగానే గొప్పగా ప్రకటించిన ఉద్యోగాల క్యాలెండర్ ఏమైపోయిందని అన్నారు జనసేనాని. ప్రణాళిక లేని తీరు వల్లే నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వ తీరుతో నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారని, ఇకనైనా ప్రభుత్వం తన తీరు మార్చుకుని ఏపీపీఎస్సీ ద్వారా రెగ్యులర్ గా ఉద్యోగాల భర్తీ ప్రకటనలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై ఉన్న సందేహాలు కూడా తొలగించాలన్నారు.