అర్హులకే సంక్షేమ ఫలాలు అందిస్తామంటూ అధికార పార్టీలు చెబుతూనే ఉన్నా.. అనర్హులు కూడా ఈ జాబితాలో ఉంటూనే ఉంటారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇది నిత్యకృత్యమే. అధికార పార్టీకి చెందినవారిమంటూ.. చాలామంది సంక్షేమ పథకాల్లో తొలి లబ్ధిదారులుగా ఉంటారు. అమ్మఒడి విషయంలో మాత్రం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులతో పెద్ద చిక్కొచ్చి పడింది. అమ్మఒడి పథకానికి ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులు. కాంటాక్ట్ ఉద్యోగులైనా, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులైనా.. ఎవరికీ అమ్మఒడి నగదు వచ్చే ప్రసక్తే లేదు. వీరందరికీ ప్రాథమికంగా రైస్ కార్డులు ఉండవు కాబట్టి.. అమ్మఒడికి అప్లికేషన్ పెట్టడానికి కూడా అనర్హులు. కానీ కొంతమంది అక్రమంగా అమ్మఒడి పథకం కింద లబ్ధి పొందుతున్నట్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వయిరీలో తేలింది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఉన్నతాధికారులు.