తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆ మధ్య సొంత పార్టీపైనే కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చేయాలనుకున్న పనుల్ని చాలా వరకు చేయలేకపోతున్నానని, స్వేచ్ఛగా ఉండలేకపోతున్నానని, టీఆర్ఎస్ లో ఉంటే ఓ లిమిటెడ్ కంపెనీలో ఉన్నట్టుందని అన్నారు. టీఆర్ఎస్ పై, కేసీఆర్ పై తనకున్న అసంతృప్తిని ఆ విధంగా బయటపెట్టారు రసమయి. తన ఆట పాటలతో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించిన బాలకిషన్ టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గాయకుడిగా ఉన్నప్పుడు స్వేచ్ఛగా తన వాణి వినిపించేవారు, నాయకుడు అయిన తర్వాత ఆ స్వేచ్ఛ లేకపోయిందని, బడుగు బలహీన వర్గాలకు అండగా పాట పాడే అవకాశం కోల్పోయానని చెప్పుకొచ్చారు.