ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో కూడా ఇంగ్లిష్ మీడియంలో బోధన చేపట్టాలనే సంకల్పంతో ఉన్నారు సీఎం జగన్. కోర్టుల్లో వ్యతిరేక తీర్పులు వస్తున్నా కూడా.. ప్రత్యామ్నాయాల అన్వేషణలో ఉంది వైసీపీ సర్కారు. ఇప్పుడు కాకపోయినా మున్ముంది ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి చేస్తారనే విషయం అర్థమైంది. అలాంటి దశలో ఏపీ సీఎం జగన్ తెలుగు భాషపై ఆసక్తికర ట్వీట్ చేశారు. మాతృభాష అంటేనే మన ఉనికి, మన అస్తిత్వానికి ప్రతీక అని అన్నారు సీఎం జగన్. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగువారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మన సంస్కృతి, సంప్రదాయాలకు, జీవన విధానానికి మూలాధారం మాతృభాష. తెలుగు భాషను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత’’ అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.