జీతాలు పెంచాలంటూ ఇటీవల ఆందోళన చేపట్టినా ఫలితం లేకపోవడంతో ఏపీలో గ్రామ, వార్డు వాలంటీర్లు దిగాలు పడిన సంగతి తెలిసిందే. జీతాలు పెంచకపోగా మీది సేవ, సేవకు డబ్బులు డిమాండ్ చేస్తారా..? అంటూ ప్రభుత్వం ఎదురు దాడికి దిగింది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వాలంటీర్లు సైలెంట్ అయ్యారు. అయితే అదే సందర్భంలో వాలంటీర్ల సేవలకు ప్రోత్సాహకాలిస్తామని చెప్పిన సీఎం జగన్, తన మాటని అమలులో పెట్టారు. సచివాలయ వాలంటీర్లకు ఉగాది రోజున సత్కరించే కార్యక్రమానికి కార్యాచరణ సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో వాలంటీర్లకు ఈ సన్మాన కార్యక్రమాలుంటాయి. జిల్లా కలెక్టర్ స్వయంగా వాలంటీర్లను సత్కరిస్తారని, వారికి సేవా రత్న, సేవా మిత్ర పురస్కారాలిస్తారని ప్రకటించారు.