పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు నడిచిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ తరపున పోటీకి సైతం అభ్యర్థులు వెనకాడిన పక్షంలో వైసీపీతోనే వైసీపీ రెబల్స్ పోటీ పడి విజేతలుగా నిలిచారు. ఈమధ్యలో జనసేన కూడా తమ సత్తా చూపించామంటూ ప్రకటించుకుంది. అయితే జనసేనకంటే కాస్త మెరుగ్గా బీజేపీ కూడా ఫలితాలు సాధించింది. అయితే ఆ ఫలితాలపై ఎక్కడా అగ్రనేతలు నోరు విప్పలేదు. తాము గెలుచుకున్న స్థానాలు ఇవీ అని ప్రకటించలేదు. ప్రకటనల్లో టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ఉన్నా కూడా బీజేపీ ఆ జోలికే వెళ్లలేదు. అయితే ఇప్పుడు మున్సిపల్, పరిషత్ ఎన్నికల విషయంలో బీజేపీ కాస్త హడావిడి మొదలు పెట్టింది. ఎన్నికల బాధ్యతలను జిల్లాల వారీగా కీలక నేతలకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.