పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ, మమతా బెనర్జీపై దాడి జరగడం, కాలు ఫ్రాక్చర్ తో ఆమె ఆస్పత్రిలో చేరడం, వీల్ చైర్ లోనే ప్రచారానికి వస్తానని చెప్పడం అందరికీ తెలిసిందే. అయితే అసలామెపై దాడి జరగలేదని, అది కేవలం ప్రమాదమేనని చెబుతోంది కేంద్ర ఎన్నికల సంఘం తెప్పించుకున్న నివేదిక. సాక్షాత్తూ ముఖ్యమంత్రే తనపై దాడి జరిగిందని చెప్పడం, నలుగురైదుగురు వ్యక్తులు తనని కారులోకి తోసేసి డోర్ గట్టిగా వేశారని, ఆ క్రమంలోనే కాలుకి దెబ్బ తగిలిందని అనడంతో ఈ వార్త కలకలం రేపింది. తనపై దాడి జరిగిన సమయంలో స్థానిక పోలీసులెవరూ అక్కడ అందుబాటులో లేరని, బందోబస్తు సరిగా లేదని కూడా మమత ఆరోపించారు. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా నివేదిక తెప్పించుకోవడం గమనార్హం.