ఏపీలో రోజు రోజుకీ కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. అటు దేశవ్యాప్తంగా కూడా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అన్నిచోట్లా ఆంక్షలు కఠినతరం చేస్తున్నారు. అయితే ఎన్నికలు ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మాత్రం నాయకులు, పార్టీ కార్యకర్తలు ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. కరోనా నిబంధనలు ఎవరూ కచ్చితంగా పాటిస్తున్న దాఖలాలు లేవు. ఏపీలో ఇటీవలే అన్ని పార్టీల అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్లు వేశారు. ఏదో మొహమాటానికి మాస్కులు పెట్టుకున్నారే కానీ, సామాజిక దూరం అన్న మాటే లేదు. ఇలాంటి దశలో ఎన్నికల ప్రక్రియ ముగిసేలోగా కరోనా కేసులు పెరుగుతాయనడంలో ఆశ్చర్యం లేదు.