'తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి' కి ఉస్మానియాలోనే బీజం పడింది. 1969, జనవరి 13న ఉస్మానియా యూనివర్సిటీలో 'కార్యాచరణ సమితి' ఏర్పాటైంది. ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా కార్యాచరణ సమితి ఏర్పాటు చేసిన విద్యార్థులు మెడికల్ స్టూడెంట్ మల్లికార్జున్ ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. విద్యార్థులు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం కావాని పిలుపునిచ్చిన మల్లికార్జున్.. జనవరి 13న తెలంగాణ వాదులందరితో కలసి సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ద్వారానే తెలంగాణ పరిరక్షణ కమిటీ ఏర్పాటైంది. ఓవైపు స్టూడెంట్ జేఏసీ, మరోవైపు నగర ప్రముఖులతో ఏర్పాటైన తెలంగాణ పరిరక్షణ కమిటీ రెండూ సమన్వయంతో పనిచేయాలని, తెలంగాణ హక్కులకోసం ఎంతటి త్యాగాలకైనా వెనకాడకూడదని తీర్మానించారు.