అనంతపురం జిల్లాలో పట్టు సాధించిన జేసీ బ్రదర్స్.. కొన్నాళ్లు సైలెంట్ అయినా.. మళ్లీ దూకుడు ప్రదర్శిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. మార్చిలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో తాడిపత్రి మునిసిపాలిటీని దక్కించుకున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గం.. సేవ్ తాడిపత్రి నినాదంతో ముందుకు సాగింది. ఈ క్రమంలో జేసీని చైర్మన్‌గా ఎన్నుకుంది. అంతకుముందు వరకు పోలీసు కేసులతో విసిగి వేసారిన.. ప్రభాకర్.. నేను మారిన మనిషిని అని ప్రకటించుకున్నారు. ఇక, ప్రజలకు సేవ చేయడమే తన విధి అని చెప్పుకొచ్చారు. తాడిపత్రిని అభివృద్ధి చేస్తామన్నారు. ఏపీలో టీడీపీ అన్ని చోట్లా ఓడిపోయినా ఒక్క తాడిపత్రిలో మాత్రమే గెలవడంతో వారి క్రేజ్ రాష్ట్ర వ్యాప్తంగా పెరిగింది.