మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా సంచయిత గజపతిరాజు కొన్నాళ్లపాటు టాక్ ఆఫ్ ది స్టేట్ గా నిలిచారు. అశోక్ గజపతిరాజు అన్నకుమార్తెగా, విజయనగరం రాజుల వారసురాలిగా ఆమె ఓ ఇమేజ్ తెచ్చుకున్నారు. బీజేపీనేతగా ఉంటూ.. వైసీపీ చలవతో ఆమె మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా ఎంపికై చక్రం తిప్పారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో ఆమె ఆ స్థానం కోల్పోయారు. ఒకరకంగా అదితి గజపతిరాజుకంటే.. ఆమె పెదనాన్న కుమార్తె సంచయితే వారసురాలిగా జనాలకు బాగా పరిచయం అయ్యారు. ఇప్పుడు తన వారసురాలిగా అశోక్ గజపతిరాజు, కుమార్తె అదితికి మరింత ప్రమోషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. మాన్సాస్ ట్రస్ట్ తిరిగి చేతికి రావడంతో.. ఆ వ్యవహారాల్లో కుమార్తెను ఇన్వాల్వ్ చేయబోతున్నారు. అటు పార్టీ పరంగా కూడా విజయనగరం జిల్లా రాజకీయాల్లో అదితి చురుగ్గా పాల్గొనేందుకు పావులు కదుపుతున్నారు. అటు అదితి అయినా, ఇటు సంచయిత అయినా.. రాజావారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేది మహిళలే కావడం విశేషం.