ఏపీలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నడిపే సంస్థలు దుకాణాలకు ప్రభుత్వం షాకిచ్చింది. కరోనా కట్టడికోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వ్యాపార వర్గాలను కష్టాల్లో పడేసేలా ఉంది. ఇప్పటి వరకూ మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధిస్తూ వచ్చారు. ఇప్పుడు మాస్క్ లు లేకుండా ఎక్కడైనా షాపులో కనిపిస్తే, ఆ షాపుకి తాళం వేస్తారు. 20వేల రూపాయల వరకు షాపు యజమానికి జరిమానా విధిస్తారు. ఇటీవల అధికారుల సమీక్షలో సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్.