ప్రచారం కోసం కేంద్రం చేసిన ప్రయత్నం ఇప్పుడు ప్రధాని మోదీకి పూర్తిగా రివర్స్ లో తగులుతోంది. గతంలో ఇంటింటికీ వంట గ్యాస్ ఇచ్చినందుకు ప్రధాని మోదీ ఫొటోలతో ప్రతి పెట్రోల్ బంకులో ఫ్లెక్సీలను కట్టేవారు. తాజాగా భారతీయులందరికీ వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తున్నందుకు థ్యాంక్యూ మోదీజీ అంటూ కొత్తరకం బ్యానర్లు వెలిశాయి. సరిగ్గా ఇదే సమయంలో పెట్రోల్, డీజిల్ రేట్లు సెంచరీ దాటేసి ఇంకా పరుగులు పెడుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో థ్యాంక్యూ మోదీజీ అనే ఉద్యమం మొదలైంది. పెట్రోలు రేట్లు పెంచి మధ్యతరగతిని వీరబాదుడు బాదేస్తున్న మోదీకి థ్యాంక్స్ అంటూ వ్యంగ్యంగా అందరూ దండాలు పెడుతూ ఫొటోలు దిగుతున్నారు. వాటికి థ్యాంక్యూ మోదీ ఛాలెంజ్ అనే హ్యాష్ ట్యాగ్ ని తగిలించి మరీ మోదీ పరువు తీస్తున్నారు.