బిజెపి వ్యతిరేక పార్టీలతో రాహుల్ గాంధీ సమావేశం జరిపారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపి పార్టీకి వ్యతిరేకంగా పోరాడాలని వివిధ ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయని తెలిపారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మోడీ వ్యతిరేక శక్తులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రానున్న రోజులలో మోడి వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని సమావేశంలో నిర్ణయించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదీజలాల పై రివర్ మేనేజ్మెంట్ బోర్డులు ఏర్పాటు చేసారని... ఏపి సీఎం వైఖరి వల్ల తెలంగాణ ఎడారిగా మారే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సీఎం నీటి వివాదాల విషయంలో ఏపీ ప్రభుత్వ అనుకూల వైఖరి అవలంబిస్తూ, కీలక సమావేశాలకు గైర్హాజరు అయ్యారంటూ రేవంత్ మండిపడ్డారు. ఢిల్లీ మీద యుద్ధం అంటూ గతంలో ప్రకటించిన కేసీఆర్ , పార్లమెంట్ సమావేశాలలో ఒక్క రోజయినా తన పార్టీ ఎంపిలతో కేంద్రాన్ని నిలదీసే ప్రయత్నం చేయలేదంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.