ఢిల్లీలో రెండో రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల నిరసన కొనసాగుతోంది. కాగా ఏపీ భవన్ వద్ద జరిగిన ధర్నాలో ఎంపీ విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. అంతే కాకుండా స్టీల్ ప్లాంట్ కార్మికులకు వైసీపీ ఎంపీలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... ఉక్కు పరిశ్రమ కార్మికులకు భరోసా ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు కార్మిక సంఘాలు తలపెట్టిన ఈ ఉద్యమాన్ని ఒక ఏడాది పాటు ఇదేలా కొనసాగిస్తే సార్వత్రిక ఎన్నికలకు గడువు దగ్గర పడుతుందని వ్యాఖ్యానించారు. ఎన్నికలను ముందు పెట్టుకుని ఏ ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోదని విజయసాయి రెడ్డి అన్నారు.