తెలంగాణలో ప్రభుత్వ కాలేజీల్లో ఈసారి ఇంటర్ అడ్మిషన్ల సంఖ్య బాగా పెరిగింది. 2015నుంచి 2020 వరకూ క్రమంగా తగ్గిన అడ్మిషన్లు ఒక్క ఏడాదిలోనే 10శాతం పెరిగాయి. అయితే ప్రైవేటులో కూడా ఈ సంఖ్య తక్కువేం లేదు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 5.78లక్షల మంది పదో తరగతి పాస్ కాగా.. ప్రభుత్వ కాలేజీల్లో కేవలం 1.78 లక్షలమందే చేరారు. మిగతా 4లక్షలమంది ప్రైవేటు కాలేజీలవైపు మొగ్గు చూపారు. ప్రైవేటు కాలేజీల్లో ఆల్రడీ సగం సిలబస్ పూర్తయింది. ఆన్ లైన్ పాఠాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ఆన్ లైన్ పాఠాలు మొదలు పెట్టినా సిలబస్ పూర్తి కావడానికి చాన్నాళ్లు టైమ్ పడుతుంది. మరోవైపు ఆఫ్ లైన్ బోధనకు కూడా ప్రభుత్వం మొగ్గు చూపడంలేదు. దీంతో ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేరిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశముందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.