స్వప్రయోజనాల కోసం పోలీస్ వ్యవస్థ ప్రతిష్టను తాడేపల్లి ప్యాలెస్ కు తాకట్టు పెట్టడం మీ కెరీర్ లో మాయని మచ్చగా మిగిలిపోతుందంటూ ఏపీ డీజీపీపై టీడీపీ నేత నారా లోకేష్ మండి పడ్డారు. దిశ చట్టాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకున్న జగన్ రెడ్డిని వదిలేసి ప్రతిపక్షాలపై ఏడుస్తారెందుకంటూ నారా లోకేష్ రెచ్చిపోయారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడిఓ సరళ గారిపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడి చేసిన ఘటనలో ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తే మౌనంగా ఎందుకున్నారంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఇంటి పక్కనే జరిగిన అత్యాచార ఘటనలో నిందితులను పట్టుకున్నారా..? అని ప్రశ్నిస్తే సమాధానం దాటవేశారంటూ లోకేష్ వ్యాఖ్యానించారు.